సాళంగనాట
సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
గతలాయ నడురేయిఁ గలిగె శ్రీకృష్ణుఁడు. IIపల్లవిII
పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు దరియించెనే యీ కృష్ణుఁడు
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాఁడు యీ కృష్ణుఁడు. IIసతుII
వచ్చి బ్రహ్మయు రుద్రుఁడు వాకిట నుతించఁగాను
యిచ్చగించి వినుచున్నాఁ డీ కృష్ణుఁడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుఁడు. IIసతుII
కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డఁడాయ నీకృష్ణుఁడు
అదన శ్రీవేంకటేశుఁడై యలమేల్మంగఁ గూడి
యెదుటనే నిలుచున్నాఁ డీ కృష్ణుఁడు. IIసతుII ౧౪-౪౫౩
Sunday, November 9, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment