ముఖారి
ఉవిదకు వొకటైతే వొకటి గాదు
వివరించి చూడవయ్య విరసము గాదు IIపల్లవిII
చెమటల యేరు వారి చింతల చెరువు నిండె
కమలాక్షికిది వానకాలముగాదు
జమళిఁ జంద్రోదయమై చకోరములు దనిసె(సి)
అమరె శారదసమయమునూఁగాదు. IIఉవిదII
కన్నీటిమంచు గురిసి కరపల్లవాలు ముంచె
కన్నెకిది హేమంతకాలము గాదు
వన్నెల నవ్వుచల్లితే వెళ్ళె జాజిపులకలు
విన్నకన్న శిశిరపువేళయుఁ గాదు. IIఉవిదII
వలపులు చిగిరించె వసంతరుతువుఁ గాదు
వెలసె విరహపెండ వేసవి గాదు
అలమేలుమంగఁ కూడితపుడె శ్రీ వేంకటేశ
మలయు నీ మన్ననలు మరపేరాదు. IIఉవిదII ౭-౨౮౬
ఆబిడకు ఒకటి ఐతే ఒకటి కాదట.ధీనిని వివరించి చూడమంటోంది.అది విరసము కూడా కాదట.
ఆవిడకు చెమటలు ఎక్కువగా ఏరు వలె కారి చింతలు అనే చెరువు నిండిందట.చూడబోతే ఆబిడకిది వానాకాలము కాదట.
జంటగా చంద్రోదయమై చకోరాలు తనిసినాయట.ఆవిడకిదేమో శరత్కాలమూ కాదట.
కన్నీరనే మంచు కురిసి చిగుర్లవంటి చేతులను ముంచివేసిందట.ఆ కన్యకు చూస్తే ఇది హేమంతకాలము కూడా కాదట.వెన్నెల్లాంటి నవ్వు నవ్వితే జాజి పులకలు బయలెళ్ళాయట.కాని ఇది వినగా చూడగా శిశిరపు వేళ కూడా కాదట పాపం.వలపులు కూడా చిగిరించాయట. కానీ ఆమెకిది వసంతకాలం కూడా కాదట.విరహమనే ఎండ కాచిందటండోయ్.కానీ వేసవి రానేలేదట.అలమేలు మంగను శ్రీ వేంకటేశుడు కూడి ఉన్నాడట.నీవు చేసే మన్నింపులు మరపు రాకున్నాయయ్యా.
Thursday, October 16, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment