Wednesday, October 15, 2008

రసికుఁడ తిరుపతి రఘువీరా

రామక్రియ
రసికుఁడ తిరుపతి రఘువీరా
కొసరుగాదు నాలోని కూరిములు గాని. IIపల్లవిII

వెలయ నీ విఱిచిన విల్లువంటిది గాదు
విలసిల్లు నా బొమ్మలవిండ్లు గాని
చెలఁగి తపసుచేసే చిత్రకూటగిరి గాదు
గిలుకొట్టు నా కుచగిరులు గాని. IIరసిII

మేటియై నీవు వేసిన మెకముచూపు గాదు
సూటిదప్పని నా కనుచూపులు గాని
గాఁటమై నీవు సేతువుగట్టిన జలధి గాదు
చాటువ నా చెమటల జలధులు గాని. IIరసిII

తగ నీవు గెలిచిన దనుజయుద్ధము గాదు
దగతోడి నా మదనయుద్ధము గాని
నగు శ్రీవేంకటేశ కనకసతిపొందు గాదు
పొగడే సీతనైన నా పొందులు గాని. IIరసిII

No comments: