శుద్ధరామక్రియ
ఇన్ని రాసులయునికి యింతి చెలువపురాశి
కన్నె నీరాశికూటమి గలిగినరాశి IIపల్లవిII
కలికి బొమవిండ్లుగల కాంతకును ధనురాశి
మెలయ మీనాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలఁగు హరిమధ్యకును సింహరాశి IIఇన్నిII
చిన్ని మకరాంకపుఁ బయ్యెద చేడెకు మకరరాశి
కన్నెపాయపు సతికి కన్నెరాశి
వన్నెమై పైఁ డితులఁదూఁగు వనితకుఁ దులారాశి
తిన్నని వాఁడిగోళ్ళ సతికి వృశ్చికరాశి। IIఇన్నిII
ఆముకొను నొరపుల మెరయు నతివకు వృషభరాశి
గామిడి గుట్టుమాఁటల సతి కర్కాటకరాశి
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతిఁ గలసె ప్రియమిధునరాశి। IIఇన్నిII ౫-౧౪౩
జ్యోతిష చక్రంలోని ౧౨ రాసులను అలమేలు మంగ పరంగా చెప్పిన సంకీర్తన।
బొమవిండ్లు గల కాంత-ధను రాశి
మీనాక్షి-మీన రాశి
కుచకుంభములు-కుంభ రాశి
హరిమధ్య-సింహరాశి
మకరాంకపుఁ బయ్యెద-మకర రాశి
కన్నె ఫ్రాయపు-కన్యా రాశి
పైఁ డితులఁదూఁగు-తులా రాశి
వాఁడిగోళ్ళ సతి-వృశ్చిక రాశి
ఒరపుల మెరయు నతివ-వృషభ రాశి
గుట్టుమాఁటల సతి-కర్కాటక రాశి
చిగురుమోవి కోమలి-మేష రాశి
వేంకటపతిఁ గలసె-మిధున రాశి
ఇన్ని రాసులయునికి యింతి చెలువపురాశి
కన్నె నీరాశికూటమి గలిగినరాశి.
Friday, October 10, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment