శ్రీరాగం
చలిగాలి వేఁడేల చల్లీనే కప్పురపు-
మలయజము తా నేల మండీనే. IIపల్లవిII
పాపంపు మనసేల పారీనే నలుగడల
చూపేల నలువంకఁ జూచీనే
తాపంపుమేనేల తడవీనే పూవింటి-
తూపేల చిత్తంబు దూరీనే. IIచలిII
వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు
కోయిలలు దామేల గొణఁగీనే
రాయడికి నలులేల రాసీనె మాతోను
కాయజుఁడు తానేల కసరీనే. IIచలిII
ఏకాంతముననేల యెదురైతినే తనకు
లోకాధిపతికేల లోనైతినే
చేకొనిదె మన్నించె శేషాద్రివల్లభుఁడు
పైకొనిదె మమ్మేల పాలించెనే. IIచలిII
గమ్మత్తైన సంకీర్తన.
అలమేలు మంగ చెలికత్తెలతో అంటున్నదీ విధంగా--
చలిగాలి వేడెందుకు చల్లుతున్నదే? కర్పూరంతో కూడిన చందనము(మంచి గంధము) చల్లగా ఉండాలి కానీ అదే ఎందుకు మండుతున్నదే?
పాపపు మనసెందులకే నాలుగు వైపులకూ పరుగెడుతుంది? నా చూపు నాలుగు వైపులకూ ఎందుకు ప్రసరిస్తుందే?
తాపంతో కూడిన శరీరం అంతా ఎందుకు తడవి నట్లౌతుందే? మన్మధుని వింటి బాణము ఎందుకే నా హృదయంలోనికి దూరింది?
గొంతెత్తి చిలుక ఎందుకు పలుమార్లు అలా వదరుతోందే? కోయిల లెందుకే తమలో తాము గొణుక్కుంటున్నాయలా?
రాయడికి నలులేల రాసీనే(నాకు దీనికి సరియైన అర్ధం స్ఫురించలేదు-ఎవరైనా తెలియజేస్తే వారికి ముందుగా నా కృతజ్ఞతలు)
మన్మథుఁడు తానెందుకే మమ్మల్నలా కసరుతున్నాడు?
తనకు(శ్రీవేంకటేశ్వకునకు) ఏకాంతంలో ఎలా ఎదురయ్యేనే నేను? లోకాధిపతికి ఎలా లోనయ్యానే నేను? నన్ను చేపట్టి ఇదే శేషాద్రివల్లభుఁడు మన్నించినాడు కదవే.పైకొని ఇదే నన్ను పాలించినాడే!
ప్రశ్నల రూపంలో చేసిన అభివ్యక్తీకరణం చాలా అందగించింది.ఎక్కువ కీర్తనలలో లాగా వేంకటేశుడు అనడానికి బదులు దీనిలో శేషాద్రివిభుడు అని పేర్కొనటం గమనించదగ్గది.
Saturday, September 13, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment