Sunday, August 3, 2008

ఏమని పొగడుదమె యీచెలిచక్కఁదనము

సామంతం
ఏమని పొగడుదమె యీచెలిచక్కఁదనము
యీమేఁటి యలమేల్మంగ యెక్కువై తానిలిచె. IIపల్లవిII

అరచంద్రుడుఁ జకోరాలద్దాలు సంపెఁగయు
ధర శింగిణులు శ్రీలు తలిరులును
అరుదుగాఁ దుమ్మిదలు నందముగాఁ గూడఁగాను
మరుతల్లి యలమేలుమంగమోమై నిలిచె. IIఏమనిII

బిసములు శంఖమును పెనుఁ జక్రవాకము లా
కసము నీలపుఁజేరు కరికుంభాలు
పొసఁగ నివెల్లానొకపోడిఁమై నిలువఁగాను
మసలక అలమేలుమంగమేనై నిలిచె. IIఏమనిII

అనఁటులంపపొదులు నబ్జములు ముత్తేలు
వొనరి వరుసఁ గూడి వుండగాను
ఘనుడైన శ్రీ వెంటేశునురముమీఁద
పనుపడలమేల్మంగ పాదములై నిలిచె. IIఏమనిII ౭-౩౩౭


ఈ కీర్తనలో చెలికత్తెలు అలమేల్మంగ ముఖాన్ని,శరీరాన్ని,పాదాల్ని వర్ణిస్తున్నారు ఈ విధంగా.

యీ చెలియ చక్కదనాన్నేమని పొగుడుదామే!అధినాయకురాలైన అలమేల్మంగ అన్నింట్లోనూ ఎక్కువై తాను నిలిచింది.
అరచంద్రుడు(నుదురు),చకోరాలు(కనుదోయి),అద్దాలు(చెంపలు),సంపెగయు(ముక్కూ),ధర(యీ భూమిమీద),శింగిణులు(విండ్లు-కనుబొమలు),శ్రీలు(చెవులు),తలిరులు(ముంగురులు),అరుదుగా తుమ్మిదలు(కనురెప్పలు)-ఇవన్నీ అందముగా కూడగాను మరుతల్లి(లక్ష్మీదేవి)అయిన అలమేల్మంగ మోము ఐ నిలిచెను.
బిసములు(తామరతూండ్లు-చేతులు),శంఖము(మెడ),పెను చక్రవాకములు(పెద్దవైన చన్నులు),ఆకసము(నడుము),నీలపు చేరు(మొలగొలుసు?),కరికుంభాలు(పెద్దవైన పిరుదులు)-పొసగునట్లు యివెల్లా ఒక సుందర దృశ్యమై నిలువగా తడయక అలమేల్మంగ శరీరమై నిలిచెను.
అనఁటులు(అరటిబోదెలు-తొడలు),అంపపొదులు(క్రింది కాళ్ళు?),అబ్జములు(పాదములు),ముత్తేలు(కాలి గోళ్ళు),ఇవన్నీ ఒప్పుగా కూడియుండి ఘనుడైన శ్రీ వేంకటేశ్వరుని వక్షస్థలము మీది అలమేల్మంగ పాదములై నిలిచినవి.
మొదటి చరణంలో పెదవులను వదలివేసారా లేక నేనే పొరబడ్డానా?

2 comments:

Sravan Kumar DVN said...

abjamu - padmamu (vamti padalu)

Sravan Kumar DVN said...

అమ్ములపొది : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) Report an error about this Word-Meaning
అంపదొన, అంపపొది, అంబులపొది, ఇషుధి, ఉపాసంఘము, కలాపము, ఖోలి, తరకసము, తరకసాతూణము, తూణము, తూణీరము, దొన, నిషంగము, పాణివడము, బత్త(డి)(ళి)క, బాణాధి, బాణాశ్రయము, శరధి, శరనిధి.