యాలపదాలు - దేసాళం
మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడ
వాడుదేరి వుస్సురందురా - వెంకటేశ
యాడనుంటివిందాఁకానురా .. ౧
పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీవుంగరము
గక్కన నేనద్దుకొందురా - వెంకటేశ
లక్కవలె ముద్రలంటెరా .. ౨
దప్పిగొంటివని నీకుఁ - గప్పురముపారమిచ్చి
ముప్పిరి నీ విరహానను - వెంకటేశ
నిప్పనుచు భ్రమసితిరా .. ౩
నిండఁ బూచిన మానిపై - గండుఁగోవిల గూయగా
నిండిన నీయెలుఁగంటాను - వెంకటేశ
అండకు నిన్ను రమ్మంటిరా .. ౪
వుదయచందురుఁ జూచి - అదె నీపంజని సవి
యెదురుకోనే వచ్చితిరా - వెంకటేశ
బెదరి మారుమోమైతిరా .. ౫
మిన్నక కేళాకూళిలో - వున్న తమ్మివిరులు నీ
కన్నులంటాఁ జేరఁ బోఁగాను - వెంకటేశ
పన్ని మరునమ్ములాయరా .. ౬
ఆనిన తుమ్మిదలు నీ - మేనికాంతిఁ బోలునని
పూనిచేతఁ బట్టఁ బోఁగాను - వెంకటేశ
సూనాస్త్రుని వేగులాయరా .. ౭
కందువ మై చమరించి - గందవొడి చల్లుకొని
పొంద నిన్నుఁ దలఁచితిరా - వెంకటేశ
అంది చొక్కు మందులాయరా .. ౮
బొండుమల్లెపానుపుపై - నుండి నిన్నుఁ బాడి పాడి
నిండుజాగరములుంటిరా - వెంకటేశ
యెండలాయ వెన్నెలలు రా ..౯
నిద్దిరించి నీవు నాకు - వొద్దనుండఁ గలగంటి
చద్దివేఁడి వలపాయరా - వెంకటేశ
సుద్దులింకా నేమి సేసేవో .. ౧౦
మల్లెపూవు కొనదాకి - ఝల్ల నను బులకించి
వుల్లము నీకొప్పించితిరా -వెంకటేశ
కల్లగాదు మమ్ముఁ గావరా .. ౧౧
జోడుగూడి నీవు నేను - నాడుకొన్న మాటలెల్లా
గోడలేని చిత్తరువులై - వెంకటేశ
యాడా నామతిఁ బాయవురా .. ౧౨
అద్దము నీడలు చూచి - ముద్దుమోవి గంటుండఁగా
కొద్దిలేని కాఁకతోడను - వెంకటేశ
పొద్దువోక తమకింతురా ..౧౩
పావురమురెక్కఁ జీటి - నీవొద్దికిఁ గంటియంపి
దేవరకే మొక్కుకొందురా - వెంకటేశ
నీవిందు రావలెనంటాను ..౧౪
బంగారు పీఁటపైనుండి - ముంగిటికి నీవురాఁగా
తొంగిచూచి నిలుచుండగా - వెంకటేశ
యెంగిలిమోవేలడిగేవు ..౧౫
దంతపుఁ బావాలు మెట్టి - పంతాన నేను రాఁగాను
యింతలో బలిమిఁ బట్టేవు - వెంకటేశ
అంత నీకుఁ బ్రియమైతినా .. ౧౬
పట్టుచీరకొంగు జారి - గుట్టుతో నేనుండఁగాను
వట్టినవ్వులేల నవ్వేవు - వెంకటేశ
దిట్టవు నీయంతవారమా .. ౧౭
కొప్పువట్టి తీసి నీవు - చెప్పరాని సేఁత సేసి
తప్పక నేఁ జూచినంతలో- వెంకటేశ
చిప్పిలేల చెమరించేవు ..౧౮
బొమ్మల జంకించి నిన్ను - తమ్మిపూవున వేసితే
కమ్మియేల తిట్టుదిట్టేవు - వెంకటేశ
నిమ్మపంట వేతునటరా ..౧౯
నెత్తమాడేనంటా రతి - పొత్తుల పందేలు వేసి
వొత్తి నీవే వోడే వేలరా - వెంకటేశ
కొత్తలైన జాణవౌదువు ..౨౦
వున్నతి శ్రీ వెంకటేశ - మన్నించి కూడితివిదే
నన్ను నెంత మెచ్చు మెచ్చేవు - వెంకటేశ
కన్నుల పండువలాయరా .. ౨౧
చిలుకలు మనలోన - కలసిన యట్టివేళ
పలుకు రతిరహస్యాలు - వెంకటేశ
తలఁచినేఁ దలవూతురా .. ౨౨
నీకు వలచిన వలపు - లాకలొత్తె నామతిని
వాకున నేఁ జెప్పఁ జాలరా - వెంకటేశ
లోకమెల్లానెరిఁగినదే .. ౨౩
పాయము నీకొక్కనికే - చాయగా మీఁదెత్తితిని
యీయెడఁ గై వాలకుండాను - వెంకటేశ
మా యింటనే పాయకుండరా .. ౨౪
ముమ్మాటికి నీ బాసలే - నమ్మివున్నదాన నేను
కుమ్మరించరా నీకరుణ - వెంకటేశ
చిమ్ముఁ జీఁకటెల్లఁ బాయను. ..౨౫
Monday, July 28, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Sir,
inta pedda kirtana post chesinanduku, mi opikaki dhanyavadalu.
nenu copy kottestunnanu.
-Sravan
http://annamacharya-lyrics.blogspot.com
Post a Comment