Thursday, July 24, 2008

అంతకంతకు గాలి నణఁగునా యనలంబు

శ్రీరాగం
అంతకంతకు గాలి నణఁగునా యనలంబు
కాంత నిట్టూర్పులాఁకలి చెరిచెఁగాక. IIపల్లవిII

కలువలూరక నీటఁ గందునా యెందైనఁ
జెలియ కన్నీరిట్లఁజేసేఁ గాక
జలజంబుపై వేఁడి చల్లునా రవి యిట్ల
వలఁచి మదనాగ్ని వదనము నొంచెఁగాక. IIఅంతII

విరులకునుఁ దుమ్మిదలు వెరచునా యెందైన
మరుబాణముల నెరులు మలఁగెఁగాక
వరుస మంచునఁ దీగె వాడునా యెందైన
అరిది చెమటలనె దేహము నొగిలెఁ గాక. IIఅంతII

కుముదహితుఁడెందైనఁ గూడునా జక్కవల
కొమరె గుబ్బలమీఁద గూడెఁ గాక
తిమిరంబు తిమిరమునఁ దెములునా యెందైన
రమణి వేంకటవిభుని రతిమఱపుగాక. IIఅంతII ౫-౧౧౦


దేనితో ఏది పొసగదో చెబుతూ కాంత విషయంలో అవి అలా అలాపొసగి వుండటానిక్కల కారణాలను చెబుతున్నా డన్నమయ్య.
అగ్ని అంతకంతకూ గాలి వీస్తుంటే ఇంకా ఇంకా ప్రజ్వలిస్తుంటుంది కాని ఆరిపోదు.కాని యిక్కడ కాంత నిట్టూర్పులు(గాలి) ఆకలిని (అగ్నిని)పాడుచేసాయిట.ఈ భావాన్ని యింకా విస్తృతపరుస్తూ అన్నమయ్య-
కలువపువ్వులు ఉట్టి పుణ్యానికి నీటిలో యెక్కడైనా కందిపోతాయా? కాని యిక్కడ చెలియ కన్నీరు కన్నులనే కలువపూవులనలా చేసింది.
తామరపై ఎక్కడైనా సూర్యుడు ఇలా వేడిని చల్లుతాడా? కాని యిక్కడ మదనాగ్ని చెలియ వదనాన్ని నలిపి ఒంచివేసిందే.
పూవులకు తుమ్మిదలెక్కడైనా భయపడతాయా? కాని యిక్కడ మరునిబాణములకు(పువ్వులు) నెరులు(?)(తుమ్మిదలు)వంకరగా నైనవి కాక.
మంచు కురిస్తే ఎక్కడానా తీగె వాడుతుందా? కాని యిక్కడ ఆమె చెమటలతో(మంచు)దేహము(తీగె) వికలమైపోయినదే.

కుముదహితుడెక్కడైనా జక్కవ పక్షులకూడి వుంటాడా? ఆ కొమరిత చన్నులపై అలా కూడివున్నాడు కాని.
చీకటి చీకటితో ఎక్కడైనా తెములుతుందా? రమణి వేంకటవిభునితో కలసిన రతి పారవశ్యంలో అలా జరుగుతుంది కాని.

కామేశ్వర రావు గారూ ! ఈ కీర్తనలో అన్నమయ్య వాడిన అలంకారం పేరేమిటో దయయుంచి తెమియజేయరూ?

No comments: