Monday, June 9, 2008

నీ వెరగవటయ్యా నెలఁతకు గర్వమని

రామక్రియ

నీ వెరగవటయ్యా నెలఁతకు గర్వమని
ఆవల నీవలనట్టే ఆడేవు గాక IIపల్లవిII

ఆఁటదానికి సిగ్గే అంతటా నిండిన సొమ్ము
నాఁటుకోఁజూచే చూపే నమ్మినసొమ్ము
మేఁటి మురిపెములే మిక్కిలి దాఁచిన సొమ్ము
వాఁటపు సెలవినవ్వే వన్నెలసొమ్ము IIనీవెII

కాంతకును గుట్టుతోడి గంభీరమేసొమ్ము
యెంతైనాఁ బదరకుండు టెక్కువసొమ్ము
పంతపు మాటలాడుటె భావము నిండినసొమ్ము
మంతుకెక్కే సణఁగులు మాయనిసొమ్ము IIనీవెII

తరుణికిఁ బతితోడి తరితీపులేసొమ్ము
బిరుదురతులె చాలాఁ బెట్టినసొమ్ము
నిరతి శ్రీవేంకటేశ నీతోఁ బెనఁగుటే సొమ్ము
సరుస మంచముపై రాజసమేసొమ్ము. IIనీవెII 7-217


ఆడదానికి గర్వమని నీవు ఎరగవటయ్యా? అక్కడా ఇక్కడా అలా అని అంటున్నావటగదా!
ఆడదానికి సిగ్గే అంతటా నిండిన సొమ్ము.మగవారి హృదయాల్లో నాటుకొనచూచే చూపే నమ్మినట్టి సొమ్ము.ఎక్కువైన మురిపెములే బాగా దాచుకొన్నసొమ్ము.వాటమైన పెదవినవ్వే వన్నెలసొమ్ము.
కాంతకు గుట్టుతోకూడిన గాంభీర్యమేసొమ్ము.ఎంతైనా కారుకూతలు కూయకుండుట ఎక్కువసొమ్ము.పంతపుమాటలు ఆడుట భావము నిండినసొమ్ము.ప్రసిద్ధికెక్కే సణగులు మాయనిసొమ్ము.
పడతికి పతితోడి ఆపేక్షలేసొమ్ము.పరాక్రమించిన రతులె చాలా పెట్టినసొమ్ము.శ్రీవేంకటేశ మిక్కిలి ఆసక్తితో నీతో పెనగుటేసొమ్ము. సరసని మంచముపై రాజసమే గొప్ప సొమ్ము.