Monday, June 9, 2008

ఎన్నఁడూ నలుగకుమీ యెదురుమాటాడకుమీ

కేదారగౌళ

ఎన్నఁడూ నలుగకుమీ యెదురుమాటాడకుమీ
పన్ని యీతని మనసు పట్టదే చెలియా IIపల్లవిII

మంచితనములకే మగలు లోనౌదురు
వంచనచేఁతలకే వలతురు
చంచులఁ బాడినందుకే సతమై కరఁ గుదురు
అంచల నింతులకివి అందములే చెలియా IIఎన్నII

ఇచ్చకపు మాటలకే యెన్నఁడును బాయరు
పచ్చి మోవితేనెలకే పైకొందురు
యిచ్చిన చనవులకే యీడుజోడై చిక్కుదురు
నిచ్చలుఁ గామినులకు నేరుపులే చెలియాIIఎన్నII

తగులాయమైనందుకే తమకింతురెప్పుడును
నగవులతేటలకే ననుపౌదురు
నిగిడి శ్రీవేంకటాద్రి నిలయునిఁ గూడితివి
తగిన సతులకివే తగవులే చెలియా IIఎన్నII 7-105


ఈ కీర్తనలో చెలికత్తె అలమేల్మంగకు శ్రీవేంకటాద్రి నిలయుని యెడల మెలగవలసిన విధానాన్ని,దానివల్ల ఒనగూడే ఫలితాలను చక్కగా వర్ణిస్తుంది.ఈ నెపంతో అన్నమయ్య సాధారణంగా సతులు తమ మగల యెడ చూపించాల్సిన నేరుపులు,అందములను గూర్చి ఎంతో హృదయంగమంగా చిత్రిస్తాడు.

మగని మీద ఎప్పుడూ అలగకమ్మా! అంతేకాదు యెదురు కూడా చెప్పవద్దు.అవి యీతని మనసును నొప్పిస్తాయే చెలియా

మంచితనాలకే మగవాళ్లు లోనౌతారు.వంచన చేతలవల్లనే సతులను ప్రేమిస్తారు.చంచుల(?)పాడితేను శాశ్వతముగా కరిగిపోతారు.ఇవన్నీ ఇంతుల ప్రక్కనుండే అందాలే చెలియా.
మనమాడే యిచ్చకపు మాటలకు వశమై మనలనెప్పడూ వదలకుండా వుంటారు.మన పచ్చితేనెగారే పెదవులకోసమే మనలనాక్రమిస్తారు.మనమిచ్చిన చనవులకు మనకీడుజోడై చిక్కుకుంటారు.ఇవి నిత్యమూ కామినులకు ఉండే నేరుపులేనే చెలియా.
మనం చూపించే అసక్తి కోసమే వాళ్లు ఎప్పుడూ త్వరపడుతూ వుంటారు. మన నవ్వుల తేటలకే వాళ్ళు అనురాగం కలవారౌతారు.ఇవన్నీ సతులకు తగిన ఉపాయాలే చెలియా!నీవు శ్రీవేంకటాద్రి నిలయుని కూడివున్నావు.