Saturday, June 7, 2008

ఎటువంటి మోహమో ఇంతి నీపై నతనికి

ఎటువంటి మోహమో ఇంతి నీపై నతనికి
తటుకున నురమున ధరియించె నిన్నును IIపల్లవిII

కామిని నీ నడపులు గజగమనములని
కామించి నీ పతి కరి గాచెను
కోమలపు నీ పిరుఁదు చక్రభావమని
నేమమై చక్రము చేత నిలిపినాడతఁడు IIఎటుII

నెలత నీ నిలయము నీరజమనుచుఁ బ్రియ
మలరి జలజనాభుఁడాయ నతఁడు
కలికి నీ గళము శంఖముఁ బోలునని తాఁ
దలఁచి పాంచజన్య ధరుఁడాయ నతఁడు IIఎటుII

నిరతి నలమేల్మంగ నీ కురులు నలుపని
అరుదార నీలవర్ణుఁడాయ నతఁడు
గిరికుచవని నిన్నుఁ గెరలి కౌఁగిటఁగూడె
పరగ శ్రీవేంకటపతి యాయ నతఁడు. IIఎటుII

7-17
ఈ కీర్తన పెదతిరుమలాచార్యుల శృంగార సంకీర్తనలలో మొదటి కీర్తన.
లక్షీదేవితో చెలికత్తె శ్రీవెంకటేశ్వరుని గురించి ఈవిధంగా వర్ణిస్తుంది.
నీపై అతనికి ఎటువంటి మోహమనంటే, ఆతడు నిన్నుతటాలున తన వక్షస్థలంపై ధరియించాడు.
ఓ కామినీ నీ నడకలు ఏనుగు నడకలని(గంభీరమైనవని)కోరి నీ పతి ఓ ఏనుగును రక్షించాడు(గజేంద్ర మోక్షము).కోమలమైన నీ పిరుదు చక్రము వలె గుండ్రంగా వుంటుందని చేతిలో చక్రాన్ని దరించాడు.ఓ లక్షీ! నీ వుండే చోటు నీట పుట్టిన తామర పువ్వని ఆ తామరపువ్వునే తన బొడ్డులో ధరించాడు.ఓ వనితా! నీ కంఠము శంఖాన్ని పోలిందని తలచినవాడై శంఖంవంటి రూపంగల పాంచజన్యాన్ని చేత ధరించాడు.ఓ అలిమేల్మంగా! నీపై నున్న ఆసక్తితో నీ కురులు నల్లన అని తలచి అరుదార(?) తనే నీలవర్ణుడయ్యాడు.పర్వతములవంటి వక్షోసంపద గలదానివని నిన్ను కౌగిలిలో ధరించి శ్రీవేంకటపతి అయ్యా డతడు.

No comments: