Thursday, June 5, 2008

ఏమని పొగడవచ్చు నిట్టి వింత సింగారములు

వరాళి
ఏమని పొగడవచ్చునిట్టి వింత సింగారము
నేమముతో రమణుఁడ నీభాగ్యమాయెను IIపల్లవిII

కమలము మీఁద రెండుకలువలు వికసించె
జమళినందువల్లనే సంపెఁగ వూచె
తమితో నాకొట్టఁగొనఁ దగదొండపండు వండె
అమర నిన్నియుఁగూడి అతివమోమాయను IIఏమII

కన్నెయరఁటులమీఁద కంతునిరథము వాలె
పన్ని సింహమొకటి యాపై నెక్కెను
సన్నలనామెకముపై సరి జక్కవలు వాలె
ఇన్నియుఁగూడఁ గూడ నింతిరూపమాయెను IIఏమII

అంచెలఁ గూర్మాలురెండు హంసలతోఁ బొందుసేసె
పొంచి బిసాలు సంకముపొత్తు గూడెను
నించి శ్రీవేంకటేశుఁడ నీ సందిటఁ బట్టఁగా
యెంచక వేవురముపై నిందిరాదేవాయెను. IIఏమII7-327
యిందిరా దేవి(లక్షీ దేవి)ని ,ఆమె రూప సౌందర్యాన్ని వర్ణించే అందమైన కీర్తన.

ఆవిడ వింతైన సింగారాన్ని ఏమని పొగడవచ్చు!ఓ రమణుడ ఆమె నియమముతో నీ భాగ్యమయింది.
కమలము మీద రెండు కలువలు వికసించాయట.
అందువల్లనే సంపెంగ పూవు కూడా పూచిందట.
ప్రేమతో ఆ సంపెంగ క్రిందగా అందమైన దొండపండు పండిందట.
చివరకివన్నీ కలిసి లక్షీదేవి ముఖముగా రూపాంతరం చెందినవట.
కమలము లాంటి ముఖము,కలువపూవుల్లాంటి కళ్ళు,సంపెంగ లాంటి ముక్కు,దొండపండు వంటి పెదవులు అన్నీ కలసి లక్షీదేవి ముఖము.
అరటిబోదెలవంటి కన్నె తొడల పైభాగాన
మన్మధుని రథం వ్రాలినదట.కలిగి ఆ పైన సింహమొకటి ఎక్కినదట.ఆ సింహము పై
రెండు చక్రవాక పక్షులు సంజ్ఞలు చేస్తూ సమానంగా వ్రాలాయట.ఇవన్నీ కలసి లక్షీదేవి రూప మయ్యాయట.తొడలను అరటిబోదెలతోను,నడుము భాగాన్ని సింహపు నడుముతోను,వక్షోజ సంపదని చక్రవాకపు పక్షులతోను పోల్చటం కవి సాంప్రదాయంగా వస్తున్నవే.
రెండు తాబేళ్ళు రెండు హంసలతో జతకూడాయట.(?)పొంచి బిసాలు సంకము పొత్తు గూడెను.(?)పైవిధంగా వర్ణింపబడిన స్త్రీ శ్రీవేంకటేశ్వరుడు సందిట పట్టగా ఈయన వురముపై
ఇందిర అంటే లక్షీదేవి అయినది.

No comments: