గుట్టుతోడి వారినేల రట్టు సేసేవు
జట్టిగొని కొసరఁగ సన్నెఱఁగవు IIపల్లవిII
కొమ్మ నిన్నుఁ జూచిచూచి కొప్పుదువ్వుకొనుటెల్లా
రమ్మనుటగాదా యేల రంతు సేసేవు
కమ్మర నప్పటి నీ కతల కూరకుండుట
సమ్మతించుటగాదా సన్నెఱఁగవు IIగుట్టుII
చెలియ నీ మొగమై సిగ్గుపడుటెల్లాను
కలసేకొరకే కాదా కాఁతాళించేవు
పొలయుట నీ ముందర పొందుసేసేనని నీతో
చలపట్టుట గాదా సన్నెఱఁగవు IIగుట్టుII
సతి నీ సంగడినుండి సరసమాడుటెల్లాను
రతికిఁ దీసుటగాదా రాపాడేవు
యితవై శ్రీవెంకటేశ యీకె యిట్టె నిన్నుఁ గూడె
చతురత లివి గావా సన్నెఱఁగవు IIగుట్టుII 25-342
గుట్టుతో ఉన్నవారిని ఎందుకు రట్టు చేస్తావు
జట్టి(?)కొని కొసరుతూ వుంటే సన్న(సంజ్ఞ) ఎరగకున్నావు.
అమె నిన్ను చూస్తూ చూస్తూ కొప్పు దువ్వుకొంటూందంటే నిన్ను రమ్మనమనే కదా అర్ధం,ఎందుకు గొడవ చేస్తావు.
అప్పుడు నీవు చెప్పే కథలన్నిటికీ ఊ కొడుతూ ఉందంటే సమ్మతించటమేనయ్యా సన్న ఎరగవూ!
చెలియ నీ మొగం చూసి సిగ్గు పడుతూ ఉందంటే నిన్ను కలసేకొరకే కదా!ఆ జాడ తెలుసుకోవేం? ఎందుకు కోపగిస్తున్నావు?
ముందరగా నీ దగ్గరగా రావటం నీతో పొందుచేసేనని పట్టు పట్టడమే!తెలుసుకోవూ!
సతి నీ దగ్గరగా సరసమాడుతూందంటే రతికి రమ్మనే!ఎందుకూరికే రాపాడతావు!
ఈమె హితవుతో ఓ వెంకటేశుడా నిన్ను కూడినది.ఇవే చతురతలంటే!.సన్న తెలసుకోలేకున్నావు!