Tuesday, June 24, 2008

అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన

లలిత
అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన
సిరులతో నుదయించె శ్రీకృష్ణుఁ డిదివో IIపల్లవిII

వసుదేవుని పాలిటి వరతపోధనము
యెసగి దేవకీదేవి యెదపై సొమ్ము
సుసరాన గొల్లెతల సొంపు మంగళసూత్రము
శిసువై వుదయించె శ్రీకృష్ణుఁ డిదివో IIఅరII

నందగోపుడు గన్న నమ్మిన నిధానము
పొందగు యశోదకు పూజ దైవము
మందల యావులకును మంచి వజ్రపంజరము
చెంది యుదయించినాడు శ్రీకృష్ణుఁ డిదివో IIఅరII

సేవసేసే దాసుల చేతిలోని మాణికెము
శ్రీవేంకటాద్రి నేచిన బ్రహ్మము
వోవరి నలమేల్మంగ నురముపైఁ బెట్టుకొని
చేవదేరె నుదయించె శ్రీకృష్ణుఁ డిదివో IIఅరII 13-333

No comments: