Saturday, June 21, 2008

తగవైన పనులివి తరుణులకెల్లాను

నాదరామక్రియ

తగవైన పనులివి తరుణులకెల్లాను

వెగటు గాకుండా నీకు విన్నవించే నిపుడు IIపల్లవిII

కొచ్చి కొచ్చి చూడవచ్చు కోపగించు కొనరాదు
పచ్చిగాఁ జెనకవచ్చు పదర రాదు
మచ్చిక సొలయవచ్చు మాఁ టలు మీఱఁ గ రాదు
యిచ్చక మెఱిఁ గినట్టి యిల్లాండ్లకును. IIతగII

మనసు సోదించవచ్చు మంకులు నెరపరాదు
పెనఁ గు లాడఁ గ వచ్చు బిగియ రాదు
కొనగోర నూఁదవచ్చు కుచ్చితము సేయరాదు
యెనసి వుండినయట్టి యిల్లాండ్లకును. IIతగII

బొమ్మలు జంకించవచ్చు పొంచి యెగ్గు పట్టరాదు
కుమ్మరించవచ్చు సిగ్గు గునియ రాదు
నెమ్మి నలమేల్ మంగను నేను శ్రీవేంకటేశుఁడ
యెమ్మెఁ గూడవచ్చు నావంటిల్లాండ్లకును. IIతగII 22-251

అన్నమయ్య అలమేల్ మంగ నోటిద్వారానే "తగవైన పనులివి తరుణులకెల్లాను" అంటూ ఇల్లాండ్లందరికీ చేయదగిన పనులను చేయకూడని వానిని విడమర్చి చెపుతున్నాడు.అది కూడా "వెగటు గాకుండా" శ్రీ వెంకటేశ్వరునికే విన్నవిస్తున్నాడు.
కొచ్చి కొచ్చి(?) (కొసరి కొసరి?) చూడవచ్చు , కోపగించు కొనరాదు. పచ్చిగా ఎదిరించవచ్చు కానీ ఆక్షేపించరాదు.మచ్చికతో వైముఖ్యము నందవచ్చు కానీ మాటలు మీఱగరాదు.-ప్రియమెఱిగినట్టి యిల్లాండ్లకు
తగవైన పనులివి.
మనసు సోధించవచ్చు, మూర్ఖపు పనులు చేయరాదు. పెనగు లాడ వచ్చు కానీ బిగిసి పోకూడదు. కొనగోటితో గీరవచ్చు కానీ కుత్సితము చేయరాదు.పొంది వున్నట్టి
యిల్లాండ్లకు తగవైన పనులివి. కనుబొమలతో జంకించవచ్చుకానీ పొంచివుండి దూషించరాదు. సిగ్గులు కుమ్మరించవచ్చు గునియ రాదు. ప్రేమతో అలమేల్మంగను నేను శ్రీవేంకటేశుడ నీతో మనోహరంగా కలియవచ్చు నావంటి యిల్లాండ్లకు.

No comments: