భైరవి
ఓరుపే నేరుపు సుమ్మీ వువిదలకు
మారుకోకు మగవాని మనసు మెత్తనిది II పల్లవిII
చలము సాదించవద్దు చనవే మెఱయవే
చెలువుఁడాతఁడే నీ చేతఁ జిక్కీని
బలుములు చూపవద్దు పకపక నగవే
అలరిన జాణతన మందులోనే వున్నది IIఓరుII
వగలు చాటఁగవద్దు పైకొని మెలగవే
సొగిసి ఆతఁడే నీ సొమ్మై వుండీని
తగవులఁ బెట్టవద్దు తమకము చూపవే
అగపడ్డ నీ పంతములందులోనే వున్నవి IIఓరుII
మొక్కలమేమియునొద్దు మోహములు చల్లవే
నిక్కి శ్రీవంకటేశుఁడు నిన్నుఁ గూడెను
తక్కులఁ బెట్టఁగ వద్దు దయలు దలఁచవే
అక్కజపు నీ రతులు అందులోనే వున్నవి IIఓరుII
స్త్రీలకు ఓర్పే నేర్పు సుమా! మరచిపోకు !మగవాని మనసు మెత్తనిది.
మాత్సర్యాన్ని సాధించవద్దు.చనువునే ప్రసరించవే! అప్పుడు నీ చెలువుడు నీ చేత చిక్కుపడతాడు.
బతిమాలించుకోవద్దు పకపకా నవ్వవే.అలరిన నెరజాణతనము అలా వుండటంలోనే వున్నది.వగలు ప్రదర్శించకు పైకొని మెలగు ఆతడు అందముగా నీ సొమ్ము అయి వుంటాడు.
తగవులు పెట్టకు తమకమే చూపించు కనిపించే నీ పంతాలు అందులోనే వున్నాయి.
ముష్కరత్వమేమీ వద్దు మోహాల్ని చల్లు శ్రీవెంకటేశుఁడు నిన్ను కూడి వున్నాడు.తప్పులు పెట్టవద్దు దయలు తలచవే ఆశ్చర్యకరమైన నీ రతులు అందులోనే వున్నవి.
Saturday, June 14, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment