Sunday, June 1, 2008

కానకుంటి మిందాకా కంటి మాడకుఁ బోదము

సీతాపహరణం తర్వాత రామలక్ష్మణులు సీతను వెదుకుతున్నప్పుడు
రామలక్ష్మణుల మధ్య జరిగిన సంభాషణా పూర్వకముగా అన్నమయ్య
చెప్పిన కీర్తన యిది. ఇటువంటి సంభాషణగా నడిచే వానిని "వాకో వాక్య"
రూపమైన కీర్తనలని కూడా అంటారు.ఇటువంటి "వాకో వాక్య"కీర్తనలు
చాలానే వున్నవి.

ఈ కీర్తనలో ఒక వాక్యము (లైను)రాముడు, తరువాతి వాక్యము లక్షణుడు
అంటున్నట్లుగా సాగుతుంది.
శ్రీరాగం

కానకుంటి మిందాకా కంటి మాడకుఁ బోదము
కానీలే అందుకేమి కళవళ మేలయ్యా IIపల్లవిII

తొంగి చూచెనదె సీత తూరుపునఁ దమ్ముఁడా
సంగతి చందురుఁడింతె సతి గాదయ్యా

చెంగట నే వెదకగాఁ జేరి నవ్వీఁ జూడరాదా
రంగగు వెన్నెల లింతే రామచంద్ర చూడుమా IIకానII

పొంచి చేతఁ బిలిచీని పొద దండ నదె సీత
అంచెలఁ దీగె ఇంతే అటు గాదయ్యా

యెంచనేల దవ్వులను యెలిఁగించీ వినరాదా
పెంచపు నెమలి గాని పిలుపు గాదయ్యా IIకానII

నిలుచుండి చూచె నదె నిండుఁ గొలఁకులో సీత
కలువలింతే ఆపె గాదయ్యా

కలికి శ్రీ వెంకటాద్రిఁ గాగిలించె నిదె నన్ను
తలపులో నాకె నిన్నుఁ దగిలుండు నయ్యా IIకానII 26-105


ఇంత దాకా సీతను కనుక్కోలేక పోయాము.దూరంగా ఆ కనిపించే చోటికి వెళ్ళి వెదకుదాము-అన్నాడు రాముడు.
దానికి జవాబుగా లక్షణుడు-అలాగే కానీ! అందుకోసమై నీకు కళవళ మెందుకయ్యా అన్నాడు.
రాము డప్పుడు -అదిగో! తూర్పున సీత తొంగి చూస్తున్నది తమ్ముడా-అంటాడు.
జవాబుగా లక్షణుడు-కనిపించే అది చందురుడే ! కాని సీత గాదయ్యా-అంటాడు.

అప్పుడాయన-దగ్గరికెళ్ళి నే వెదగ్గా నను చేరి నా సీత నవ్వుతోంది చూడరాదా-అంటాడు.
లక్ష్మణుడు-నువ్వనుకొనే ఆ నవ్వులు రంగులలో మెరిసే వెన్నెలలే ! రామచంద్రా వేరు కాదు, సరిగా చూడ మంటాడు.

పొద చెంత నుండీ చేత్తో నన్ను సీత పిలుస్తోంది! చూడయ్యా-రాముడు
అది హంస తీగ ఇంతే కాని అటు పిలవడం కాదయ్యా-లక్ష్మణుడు.

రాముడు- ఆలోచించక్కరలేదు.దూరాన యెలుగెత్తి పిలుస్తోంది.వినబట్టంలేదా!?
లక్ష్మణుడు-అది పిలుపు గాదయ్యా పింఛాన్ని ధరించిన నెమలి క్రేంకారమది.

రాముడు-నిండు కొలనిలో నిలచి సీత నన్ను చూస్తోందయ్యా
లక్ష్మణుడు- అని కలువపువ్వులయ్యా !ఆమె గాదు.
రాముడు- సీత ఈ వేంకటాద్రి మీద ఇదో నన్ను కాగిలించినదయ్యా
లక్ష్మణుడు- నీ తలపులో ఆమె నిన్ను తగిలి(కౌగలించుకొని) ఉన్నదయ్యా

ఇలా రామచంద్రమూర్తి సీతా విరహార్తిలో పరిపరి విధములుగా దుఃఖిస్తుండగా లక్ష్మణుడు నిజ పరిస్ధితిని వివరిస్తున్న
కీర్తన యిది.

No comments: