Sunday, December 7, 2008

ఎన్ని వేదాలు చదివి యెంత సోమయాజివైన

పాడి
ఎన్ని వేదాలు చదివి యెంత సోమయాజివైన
కన్నెలు వద్దనుండగా కాంక్షలేల తీరును. IIపల్లవిII

కోరకుండేవా నీవు గొల్లెతలఁ గనుగొంటే
పారదా మనసు వారిపాలిండ్లపై
ఊరదానినోరుతేనె లొలికేమోవిపండ్లకు
పేరదా వలపు వారి బెల్లింపుమాటలను. IIఎన్నిII

చిక్కవా వారికి నీవు చేతులు పైఁ జాఁచితేను
చొక్కకుండేవా మేనులు సోఁకించితేను
చక్కనుండేవా వారు సరసము లాడితేను
పక్కన రేఁగదా తమి భావించి నవ్వితేను. IIఎన్నిII

పాయఁగలవా సతులు భ్రమయించి కూడితేను
ఆయనా తనివి నీకు నంతలోననే
యేయెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మాయలకు లోనుగాదా మంతనమాడితేను. IIఎన్నిII ౧౬-౪౯౨

No comments: