Saturday, July 25, 2009

చదివితిఁ దొల్లి కొంత చదివే నింకాఁ గొంత

శ్రీరాగం
చదివితిఁ దొల్లి కొంత చదివే నింకాఁ గొంత
యెదిరి నన్నెఱఁగను యెంతైనా నయ్యో. IIపల్లవిII

వొరుల దూషింతుఁగాని వొకమారైన నా-
దురితకర్మములను దూషించను
పరుల నవ్వుదుఁగాని పలుయోనికూపముల
నరకపు నామేను నవ్వుకోను. IIచదివితిII

లోకులఁ గోపింతుఁగాని లోని కామాదులనేటి-
కాకరిశత్రులమీఁద గడుఁ గోపించ
ఆకడ బుద్దులు చెప్పి అన్యుల బోధింతుఁగాని
తేకువ నాలోని హరిఁ దెలుసుకోలేను. IIచదివితిII

యితరులదుర్గుణము లెంచి యెంచి రోతుఁగాని
మతిలో నా యాసలు మానలేను
గతిగా శ్రీవేంకటేశుఁ గని బ్రదికితిఁగాని
తతి నిన్నాళ్ళదాఁకా దలపోయలేను. IIచదివితిII 4-74

No comments: