Wednesday, April 15, 2009

చెప్పినట్టు సేతుగాక చెలువునియెడ నీవు

కేదారగౌళ
చెప్పినట్టు సేతుగాక చెలువునియెడ నీవు
ముప్పిరి బెనగుదురా మోహించినదానవు. IIపల్లవిII

వొగ్గి నీరమణుఁ డిదె వొడిపట్టుకుండఁ గాను
సిగ్గులేలే చింతలేలే చెల్లఁబో నీకు
దగ్గరఁ గూచుండి తానే తతి నిన్ను వేఁడుకోఁగా
యెగ్గులేలే యెమ్మెలేలే యింకా నీకు. IIచెప్పిII

పలుకుల నీ విభుఁడు పాలార్చఁగా నిన్ను
అలుకేలే కలఁకేలే అద్దో నీకు
నిలుచుండి యాతఁడు నిన్ను నొడఁబరచఁగా
చలమేలే బలిమేలే సారెసారె నీకు. IIచెప్పిII

కడు శ్రీవేంకటేశుఁడు కాఁగిలించుకుండఁగాను
తడవేలే గొడవేలే తగవా నీకు
అడరి యలమేల్మంగవని నిన్నుఁ గూడె నేఁడు
బెడసేలే గడుసేలే ప్రియురాల నీకు. IIచెప్పిII ౨౦-౪౭౭

No comments: