Friday, March 20, 2009

ఇందాఁకా రాఁడంటా పతినేల దూరేవే

ముఖారి
ఇందాఁకా రాఁడంటా పతినేల దూరేవే
కందువ నెదురుకొని కాఁగిలించుకొనవే. IIపల్లవిII

పగవారికైనాను పంతములిచ్చుట మేలు
మొగమాట మతిలోన ముంచుకొంటేను
జగడములాడినాను నగుతా నుండుట మేలు
పగటుఁ జుట్టరికము పాయరాకుండితేను. IIఇందాకII

కడుఁ గోపినైనాను కనిపొగడుట మేలు
వడి నందుఁ బనిగొనవలసితేను
తడవవచ్చినఁ దానె తప్పించుకొనుట మేలు
వొడఁబాటు బాసలు వొనరి వుండితేను. IIఇందాకII

వెక్కసియైన దొరను వేఁడుకొనుటే మేలు
యెక్కడా సుకము తన కెడవైతేను
చక్కని శ్రీవేంకటేశ్వరుఁడు నిన్నిదె కూడె
మొక్కుటమేలు రతి ముచ్చటైతేను. IIఇందాకII ౨౬-౨౭౫

ఏ యే సందర్భాలలో యేమేమి చేస్తే మేలుగా నుంటుందో చెపుతున్నారిక్కడ.

ఇంకా రాలేదని పతిని ఏల దూరుతున్నావే, నీవే ఎదురెళ్ళి కాగిలించుకోవచ్చు గదా.

పగవారికైనా సరే మొగమాటము తప్పనపుడు పంతము వదులుకోవటమే మేలు.
చుట్టరికము విడువలేనిదైనపుడు జగడమాడినా నవ్వుతూ వుండటమే మేలు.

పని వున్నప్పుడు కడు కోపిస్టి నైనా సరే చూచినపుడు పొగడ్డమే మేలు.
సమ్మతైన బాసలు కలిగున్నప్పుడు వెక్కసము గల దొర నైనా వేడుకోవటమే మేలు.

తనకు సుఖము యెక్కడా దొరకనప్పుడు వెక్కసి యైన దొరనైనా వేడుకోవటమే మేలు మరి.
రతి యందు కోరికైతే శ్రీవేంకటేశ్వరునికి మొక్కితేనే మేలు అతను తన్ను కూడుతాడు.

No comments: