Wednesday, March 18, 2009

చిన్ని శిశువూ చిన్ని శిశువూ

ఆహిరి
చిన్ని శిశువూ చిన్ని శిశువూ
యెన్నడుం జూడ మమ్మ యిటువంటి శిశువూ. IIపల్లవిII

తోయపుంగురులతోడఁ దూ గేటి శిరసు, చింత
కాయలవంటి జడలగములతోడ
మ్రోయుచున్న కనకంపు మువ్వల పాదాలతోడ
పాయక యశోదవెంటఁ బాఱాడు శిశువూ. IIచిన్నిII

ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగరాల
నిద్దపుంజేతుల పైఁడి బొద్దులతోడ
అద్దపుంజెక్కులతోడ నప్ప లప్ప లనినంత
గద్దించి యశోదమేనుఁ కౌఁగిలించు శిశువూ. IIచిన్నిII

బలుపైన పొట్టమీఁది పాలచాఱలతోడ
నులివేఁడి వెన్నదిన్న నోరితోడ
చెలఁగి నేఁ డిదె వచ్చి శ్రీవేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువూ. IIచిన్నిII -

తోయము=విధము
గముల=సమూహముల
మొరవంక=మోముదిక్కు
నిద్దపుం=నునుపు గల
నులివేడి వెన్నతిన్న నోరు-ఎంత అందమైన ప్రయోగము

No comments: