Saturday, February 21, 2009

ఎంత తపము సేసితో యీకెకుఁ గాను

సాళంగనాట
ఎంత తపము చేసితో యీకెకుఁ గాను
మంతు కెక్క నీకుఁ గల్గె మంచి పెండ్లి కూతురు. IIపల్లవిII

చన్నులే చిన్నలుగాని సతిమోహము ఘనము
కన్నులు గొప్పలు నవ్వు కడుఁ గొంచెము
కన్నెపడు చింతెకాని కడలేని చేఁతలు
ఇన్నిటా నీకు గలిగె నిదె పెండ్లికూఁతురు. IIఎంతII

చేరఁడే మొగముగాని సిగ్గయితేఁ చేటఁడు
బారెడేసి నెరులు చెప్పరాదు గుట్టు
యీరీతి ముగుదగాని యెమ్మెలు కోటానఁగోటి
కోరినట్టే కలిగె నీకునుఁ బెండ్లికూఁతురు. IIఎంతII

పాదాలే చిగురుగాని భావమెల్లా నిండుఁ జేగ
భేదాలు మోవులు మాటప్రియ మొక్కటే
యీ దెస శ్రీ వేంకటేశ యీకె యలమేల్ మంగ
నీ దేవులై నినుఁ గూడె నిచ్చఁ బెండ్లికూఁతురు. IIఎంతII౧౪-౫౨౯

అలమేలు మంగ లక్షణాలని చెలికత్తె వేంకటేశ్వరునికి చెపుతోందీ విధంగా.

ఎన్నాళ్ళీమె కోసం ఎంత తపస్సు చేసావో కాని చివరికి ప్రసిద్ధికెక్కేట్లుగా నీకు మంచి పెండ్లికూతురే దొరికిందయ్యా.
ఈపె చన్నులు చిన్నవే, కానీ ఈబిడ మోహము ఉంది చూసావూ -అది ఘనమైందే. కన్నులేమో చూడబోతే ఆల్చిప్పలే, నవ్వుమాత్రం చిరునవ్వేనూ.ఈవిడ చూట్టానికి కన్నెపడుచే కాని ఈపె చేతలు మాత్రం అబ్బో చెప్పక్కరలేదు.ఈగుణాలన్నిటితో పాటు ఇదిగో ఈ పెండ్లికూతురు నీకు దొరికిందయ్యా.

మొగము చేరడే, కాని ఈవిడకు సిగ్గయితే చేటడే.ఆ గుట్టు నే చెప్పకూడదు కాని ఈమె జుట్టుంది చూసావూ బారెడు .చూట్టానికి ముగ్ధే- కాని ఈవిడ యెమ్మెలు మాత్రం కోటానుకోటి. నువ్వు కోరుకున్నట్లే నీకు సరిజోడే దొరికింది.

ఈమె పాదాలైతే బహులేత కాని ఈమె భావాలుమాత్రం కడు చేవకలిగినవే. పెదవులు విడిగానున్నా కానీ ఈవిడ మాటప్రియం ఒక్కటే. ఈవిడే అలమేల్ మంగ--నీ దేవిరియై నిను చేరవచ్చిన నీ నిత్య పెండ్లికూతురు.

No comments: