Friday, February 20, 2009

తగవు నీ వెరఁగవా తరుణి నేల దూరేవు

హిందోళవసంతం
తగవు నీ వెరఁగవా తరుణి నేల దూరేవు
నగుతా నాటకములు నడపేవు గాక. IIపల్లవిII

మాఁటాడించి రమణుఁడు మరిగించుకొనుఁ గాక
ఆటది సిగ్గువడదా అందరిలోన
పాటించి లోనికి వచ్చి పవ్వళింతువు గాక
పీఁట వెట్టి రమ్మని పిలుతురా రతికి. IIతగవుII

కొద్దితోఁ బ్రియుఁడు మతికొంకు దేర్చవలెఁ గాక
ముద్దరా లెరుఁగునా మునుపె నవ్వ
వొద్దఁ బెట్టెకొని నీవె వొడి వట్టుదువు గాక
సుద్దు లడిగి చన్నులు చూపుదురా చెలులు. IIతగవుII

మన్నించి కాఁగిటఁ జేర్చి మగఁ డన్ని నేర్పుఁ గాక
కన్నియ పైకొనునా కాఁతాళనను
యెన్నిక శ్రీవేంకటేశ యేలి మోవి యడిగేవు
సన్నల నలమేల్మంగ చాఁచునా సారెకును. IIతగవుII౧౪-౪౬౧

నవ్వుతూ నాటకాలు నడుపుతున్నావే ? తరుణిని దూరుతున్నావేం?-- న్యాయమేంటో నీ వెరగవా ----(నీకే తెలుసును)

ఆటదానిని నెమ్మది నెమ్మదిగా మాటలలోకి దించి హృదయేశ్వరుడు పరిచయము పెంపు చేసుకోవాలె!-- అలాకాక అందరిలోనా ఆటది సిగ్గుపడదా ఏం? నీ అంత నీవే లోనికి వచ్చి మంచమెక్కాలి-- కానీ ఎవ్వరైనా రతికి రమ్మని పీటపెట్టి మరీ పిలుస్తారా ఏమిటి?
ప్రియుడు కొద్ది కొద్దిగా ప్రేయసిని జంకునుండి తేర్చాలి కానీ ముద్దరాలే! ఆమె-- కొత్తలోనే ఎలా నవ్వగలుగుతుందయ్యా!
ఆపెను నీవే వొడిలోనికి తీసుకొని దగ్గరకు చేర్చుకోవాలి కానీ చెలులు వారంతవారే కబుర్లు చెబుతూ చన్నులు చూపిస్తారా ఏవిటి?
ఆవిడను మన్నించి కౌగిలిలోనికి తీసుకుని మెల్లగా అన్నీ నేర్పుకుంటారు, అలాకాక ఆమె ఇప్పటిదాకా కన్నియ యేగా తొందరగా స్వతంత్రించగలదా? ఓ స్వామీ అప్పుడే పెదవినిమ్మని అడిగేవేమి? అలమేల్మంగ మాటిమాటికి సన్నలకే మోవి చాచునా ఏమిటయ్యా?
కొత్త పెళ్ళికూతురిని పెళ్ళికొడుకు మొదటి రాత్రి ఎలా దారిలోకి తెచ్చుకోవాలో ఎలా తొందరపడకుండా ఉండాలో అన్నమయ్య ఈ కీర్తన ద్వారా మనకందరికీ తెలియజేస్తున్నాడు.

No comments: