వరాళి
ఒకటి కినుమడాయె నువిదసింగారాలు
సకలముఁ జిత్తగించు జాణఁడవు నీవు IIపల్లవిII
నిలువు దురు మొక్కటే నిండుఁజీఁకటిగాని
నెలఁత నవ్వులైతే వెన్నెల కుప్పలు
పలుచనికెమ్మోవి పచ్చిచిగురింతేకాని
అలరిన దంతములైతే వజ్రములే. IIఒకII
పట్టరాని నెన్నడుమే భావించసన్నముగాని
గట్టిచన్నలైతేను కడుగొప్పలు
అట్టె మెఱుఁగుఁదొడ లాఁదోకలై వుండెఁగాని
మిట్టలైనపిఱుఁదులు మిక్కిలి బటువులే. IIఒకII
యించుకంతలు పాదాలే యెఱ్ఱని వన్నేయఁగాని
యెంచిచూడ మేనెల్లా హేమవర్ణమే
కొంచక శ్రీవేంకటేశ కూడితి వీకెను నేఁడు
మించిన యాపెవలపు మేలుమీఁది మేలు. IIఒకII ౨౮-౧౯౫
వన్నె+ఆయన్=వన్నేయన్
ఒకదాని కొకటి వ్యతిరిక్తములైన వాటితో అలమేలు మంగ శరీరావయవములను వర్ణించడం అదో అందమైన సొగసు.
Sunday, February 1, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment