Monday, January 5, 2009

నే నొక్కఁడ లేకుండితే నీకృపకుఁ బాత్ర మేది



బౌళిరామక్రియ
నే నొక్కఁడ లేకుండితే నీకృపకుఁ బాత్ర మేది
పూని నావల్లనే కీర్తిఁ బొందేవు నీవు. IIపల్లవిII

అతిమూఢులలోన నగ్రేసరుఁడ నేను
ప్రతిలేనిఘనగర్వపర్వతమను
తతిఁ బంచేంద్రియములధనవంతుఁడను నేను
వెతకి నావంటినాని విడువఁగఁ జెల్లునా. IIనేనొII

మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాఁడ నేను
యిహమునఁ గర్మవహికెక్కితి నేను
బహుయోనికూపసంపదఁ దేలేవాఁడ నేను
వహించుక నావంటివానిఁ దేనోపేవా.IIనేనొII

భావించి నావంటినీచుఁ బట్టి కాచినప్పుడుగా
యేవంక నీకీర్తి గడు నెంతురు భువి
నావల్ల నీకుఁ బుణ్యము నీవల్ల నే బ్రదుకుదు
శ్రీవేంకటేశుఁడ యింత చేరెఁ జుమ్మీ మేలు.IIనేనొII3-౪౯

No comments: