సామంతం
ఆతనిఁ జూపవె మాకు నదెంతచక్కనివాఁడొ
ఆతఱి నిన్నుఁ గలసినంతటిజాణఁ డెవ్వఁడె. IIపల్లవిII
జక్కవచన్నులమీఁద చంద్రోదయము లాయ
చుక్కలు నీమోవిమీఁదఁ జూపట్టెను
మిక్కిలి శిరసుమీఁద మేఘములు గారుకొనె
యెక్కడనుండి వచ్చేవే యెవ్వఁడే నీమగఁడు. IIఆతనిII
సరిఁ గన్నుకలువల సంధ్యాకాలము వచ్చె
అరిది సంపెంగముక్కం దాయిటి రేఁగె
తొరిగి చుక్కమీఁదఁ దొలుకరించెఁ జెమట
యిరవై యేడనుంటివే యెవ్వఁడే నీమగఁడు. IIఆతనిII
నాటుకొని సెలవుల నవ్వులవెన్నెల గాసె
తేటలచూపులనే తెల్లవారెను
మేటి శ్రీవేంకటాద్రిదేవుఁడఁ(డం?)టా నీవు
యేటవెట్టుకుండె(డే?)నా(వా?)తఁ డెవ్వఁడే నీమగఁడు.IIఆతనిII౧౮-౮౨
ఇదో అందమైన సంకీర్తన.
అలమేలుమంగని చెలులు నీ విభుడ్ని మాకు చూపించవమ్మా ఆతడెంతటి చక్కనివాడో మేమూ చూస్తాం అని అడుగుతుంటారు.నిన్ను ఆసమయంలో కలిసిన ఆ జాణడయినవానిని మాకూ చూపించవే మేమూ చూడాలి అంటారు.ఇలా అంటూ ఆ సమయంలో ఆమె ఉన్నతీరు నిలా వర్ణిస్తారు.
జక్కవ పక్షులను పోలిన చనుగవ పైని ఆమె ముఖబింబం చంద్రోదయమైనట్లుగా అనిపిస్తోందట.ఆమె ముఖం పైనేమో నక్షత్రాలు కనిపిస్తున్నాయట.ఆమె శిరస్సుపైనున్న నల్లని తలనీలాలు మేఘములు దట్టంగా కమ్ముకున్నట్టున్నాయట.నువ్విప్పుడెక్కడినుంచి వచ్చావే? నీమొగుడెవరే? ఆతనిని మాకూ చూపించు,మేము చూడాలి.
సరి!నీ కలువలవంటి కనులకు సంధ్యాకాలము వచ్చిందే!(మూతలు పడుతున్నాయన్న మాట).సంపెంగను పోలిన ముక్కునుండి ఆవిరితో కూడిన గాలి వెలువడుతుందే!(గాఢమైన నిట్టూర్పులు విడుస్తున్నదన్నమాట).నుదుటి మీదనున్న చుక్క(బొట్టు)పైన చెమట తొలకరిస్తున్నదే(ఎంత అందమైన పద ప్రయోగం).నువ్వు ఇప్పుడెక్కడ ఏ స్థానంలో ఉన్నావే? నీ మగడెవ్వడే?ఆతనిని మాకూ చూపించు,మేము చూడాలి.
నీ నవ్వులు పెదవులనంటిపెట్టుకుని వుండటం వల్ల పెదవులమీద వెన్నెల కాసినట్టుగా ఉందే. తెల్లటి నీ చూపులతోనే తెల్లవారి పోయిందే. శ్రీవేంకటాద్రిదేవుడు(స్వామి)ని అందరికంటె మేటి యైన వాడంటూ నీ పక్షాన్నివహించినవాడని తలపోస్తున్నావు.ఎవరే నీ మగడు?ఆతనిని మాకూ చూపించు,మేము చూడాలి.
Thursday, December 11, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment