Tuesday, December 9, 2008

ఏమని పొగడుదుమే యిఁక నిన్నును

శంకరాభరణం
ఏమని పొగడుదుమే యిఁక నిన్నును
ఆమని సొబగుల అలమేల్మంగ. IIపల్లవిII

తెలిఁ గన్నుల నీ తేటలేకదవే
వెలయఁగ విభునికి వెన్నెలలు
పులకలమొలకలపొదు లివిగదవే
పలుమరుఁ బువ్వులపానుపులు. IIఏమనిII

తియ్యని నీమోవి తేనెలే కదవే
వియ్యపురమణుని విందు లివి
ముయ్యకమూసినమొలకనవ్వుగదె
నెయ్యపుఁ గప్రపునెరిబాగాలు. IIఏమనిII

కైవశమగు నీకాఁగిలేకదవే
శ్రీ వేంకటేశ్వరుసిరినగరు
తావుకొన్న మీతమకములేకదే
కావించిన మీకల్యాణములు. IIఏమనిII
౧౮-౫౩౮

No comments: