Monday, March 15, 2010

రాముఁడు లోకాభిరాముఁ డందరికి రక్షకుఁ డీతనిఁ దెలిసి కొలువరో

నాట
రాముఁడు లోకాభిరాముఁ డందరికి రక్షకుఁ డీతనిఁ దెలిసి కొలువరో
కామితఫలదుఁడు చరాచరములకుఁ గర్తయైన సర్వేశ్వరుఁడితఁడు   II పల్లవిII

తలఁప దశరథతనయుఁడట తానె తారకబ్రహ్మమట
వెలయ మానుషపు వేషమట వెగటుగ హరువిల్లు విరిచెనట
అలరఁగ తానొక రాజట పాదాన నహల్యశాపము మాన్చెనట
సొలవక దైవికమానుషలీలలు చూపుచు మెరసీఁ జూఁడరో యితఁడు . II రాముII 

జగతి వసిష్ఠునిశిష్యుఁడట జటాయువుకు మోక్ష మిచ్చెనట
అగచరులే తనసేనలట అంబుధి కొండలఁ గట్టెనట
మగువకొరకుఁగానట కమలాసను మనుమనిఁ రావణుఁ జంపెనట
తగ లౌకికి వైదికములునొక్కట తానొనరించీఁ జూడరో యితఁడు .        II రాముII

వెస నమరుల వరమడిగెనట విభీషణపట్టము గట్టెనట
యెసగ నయోధ్యకు నేలికట యింద్రాదులకుఁ గొలువిచ్చెనట
పొసగ శ్రీవేంకటగిరి నివాసమట భువనము లుదరంబున ధరించెనట
సుసరపుసూక్ష్మాధికములు తనందుఁ జూపుచునున్నాఁడు చూడరో యితఁడు. II రాముII  4-277

1 comment:

thinker said...

భావం కూడా జత పరిస్తే మాలాంటి చదువుకున్న పామరులకు భోధపడుతుంది. ఎమైతేనేం అర్థం లీలగా అవగతమైంది. ధన్యవాదాలు